భారత రాజ్యాంగ చరిత్ర

భారత రాజ్యాంగ చరిత్ర
        ఒక దేశం మౌలిక శాసనాన్నే రాజ్యాంగం అంటారు. శాసనసభ (మన దేశంలో దీన్ని పార్లమెంట్‌గా పేర్కొంటున్నాం) చేసే చట్టానికి రాజ్యాంగం దిక్సూచి లాంటిది. శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖల పరిధి, అధికారాలను రాజ్యాంగం నిర్వచిస్తుంది, నియంత్రిస్తుంది. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలను ప్రభుత్వాంగాలు అంటారు. పై మూడింటిలో ఏ ఒక్క శాఖ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వెళ్లినా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. ఈ మూడు శాఖల మధ్య సమన్వయాన్ని కుదిర్చి, వాటి మధ్య నిరోధ సమతౌల్యతలను (Checks & Balances) ఏర్పాటు చేసే అద్భుత సాధనమే రాజ్యాంగం. ఎందరో న్యాయ కోవిదులు ప్రపంచ రాజ్యాంగాలను వడపోసి, ఆవిష్కరించిన మన రాజ్యాంగం నిజంగా ఒక అద్భుత గ్రంథం. రాజ్యాంగ చరిత్ర గురించి తెలుసుకుందాం.
    
    వర్తక, వాణిజ్యాల నిమిత్తం మిగిలిన ఐరోపావారిలాగే ఇంగ్లండ్ వారు భారతదేశానికి వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 డిసెంబరు 31 న ఎలిజిబెత్ రాణి నుంచి Royal Charter పొందింది. దీనివల్ల వారికి భారతదేశంలో వర్తకానికి సంబంధించిన సర్వాధికారాలు దక్కాయి. అప్పటి భారతదేశంలోని చిన్న చిన్న రాజ్యాల మధ్య ఉన్న అనైక్యత వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ బొంబాయి, మద్రాస్‌లలో తమ వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటూ, సామ్రాజ్య విస్తరణను చేపట్టారు. అప్పటికే మొగల్ సామ్రాజ్యం పతనావస్థలో ఉండటం వారికి కలిసొచ్చింది.
1757 లో జరిగిన ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబుపై ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించింది. దీంతో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి స్థిరమైన పునాది పడింది. ఆ తర్వాత బక్సర్ యుద్ధంలో గెలుపుతో బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో దివానీ (రెవెన్యూ, న్యాయ సంబంధమైన) హక్కులు ఈస్ట్ ఇండియా కంపెనీ వశమయ్యాయి.
రెగ్యులేటింగ్
చట్టం
(1773)        ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్ తీసుకు వచ్చిన చట్టమిది. కంపెనీకి భారతదేశంలో రాజకీయ పరిపాలన బాధ్యతను గుర్తు చేసేందుకు కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. అప్పటివరకు స్వతంత్రంగా వ్యవహరిస్తున్న బాంబే, మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీలను బెంగాల్ గవర్నర్ జనరల్ నియంత్రణలోకి తెచ్చారు.పిట్స్ ఇండియా చట్టం (1784): బ్రిటిష్ పార్లమెంట్ చేసిన ఈ చట్టంతో ఈస్ట్ ఇండియా కంపెనీని కేవలం వర్తక వాణిజ్యాలకు పరిమితం చేస్తూ ఆరుగురు సభ్యులతో కూడిన బృందానికి రాజకీయ అంశాలకు సంబంధించిన నిర్ణయాధికారాన్ని ఇచ్చారు.1833 చార్టర్: బ్రిటిష్ హయాంలో రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి దీన్ని తొలి అడుగుగా పేర్కొనవచ్చు. ఇది వ్యవస్థీకృతమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. శాసన విభాగానికి, కార్యనిర్వాహక వర్గానికి మధ్య వ్యత్యాసం కనిపించడం ఈ చట్టంతోనే మొదలైంది. బ్రిటిష్ పాలిత ప్రాంతాల సంపూర్ణ పర్యవేక్షణ గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కు అప్పగించారు.
1853 చార్టర్: ఈ చార్టర్‌తో ఆరుగురు కొత్త లెజిస్లేటివ్ కౌన్సిలర్లను గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కి కల్పించటం జరిగింది. ఈ కొత్త చేరికతో గవర్నర్ జనరల్ శాసన విభాగం ఒక మినీ పార్లమెంట్‌గా మారింది. అలాగే, సివిల్ సర్వీసెస్‌లో ప్రవేశించడానికి భారతీయులకు కూడా అవకాశం కల్పించారు.1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటుతో (వి.డి. సావర్కర్‌ లాంటి వారు దీన్ని తొలి స్వతంత్ర సంగ్రామంగా పేర్కొన్నారు) అప్పటివరకు ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దుచేసి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ పరిపాలనను చేపట్టింది.భారత ప్రభుత్వం చట్టం - 1858 ముఖ్యాంశాలు* భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది.* గవర్నర్ జనరల్ హోదాను వైస్రాయ్‌గా మార్చారు.* బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ద్వంద్వ విధానానికి స్వస్తి పలికారు.* భారతదేశ పరిపాలన కోసం సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే కొత్త పదవి సృష్టించారు. ఈ సెక్రెటరీ బ్రిటిష్ క్యాబినెట్ సభ్యుడు. ఇతను భారతదేశ పాలనకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్‌కు బాధ్యత వహిస్తాడు. భారతదేశ పాలనా వ్యవహారాలకు సంబంధించి 15 మంది సభ్యులు ఇతనికి సహకరిస్తారు.
1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం ముఖ్యాంశాలు
* శాసనాలు రూపొందించే ప్రక్రియలో భారతీయుల భాగస్వామ్యం ఈ చట్టంతో ప్రారంభమైంది. వైస్రాయ్ తన కౌన్సిల్‌లో Non-Official సభ్యులుగా భారతీయులను తీసుకోవాలని ఈ చట్టం సూచిస్తోంది. లార్డ్ కానింగ్ తన శాసన విభాగంలో సభ్యులుగా బెనారస్ రాజా, పటియాలా మహారాజు, సర్ దినకర్‌రావులను చేర్చుకున్నారు.* బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీలకు శాసన అధికారాల్లో స్వయం ప్రతిపత్తి కల్పించడంతో ఒక రకంగా అధికార వికేంద్రీకరణకు ఈ చట్టం దోహదం చేసిందని చెప్పొచ్చు.* ఈ చట్టం అత్యవసర పరిస్థితుల్లో ఆర్డినెన్స్ జారీచేసే అధికారాన్ని వైస్రాయ్‌కు కల్పించింది.1892 చట్టం ముఖ్యాంశాలు
* శాసనసభ విభాగాల్లో నాన్ - అఫీషియల్ సభ్యుల సంఖ్యను పెంచారు.* బడ్జెట్‌పై చర్చించి, కార్వనిర్వాహక వర్గాన్ని ప్రశ్నించే అధికారాన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి కల్పించింది.
1909 చట్టం
         దీన్నే మింటో-మార్లే సంస్కరణల చట్టం అని కూడా అంటారు. (లార్డ్ మింటో అప్పటి వైస్రాయ్, లార్డ్ మార్లో అప్పటి సెక్రెటరీ ఆఫ్ స్టేట్)
ముఖ్యాంశాలు:* కేంద్ర శాసన కౌన్సిల్‌లో సభ్యుల సంఖ్యను 16 నుంచి 60 కి పెంచారు.* కేంద్ర శాసన కౌన్సిల్‌లో అఫీషియల్ మెజారిటీ కొనసాగినప్పటికీ, రాష్ట్ర శాసన కౌన్సిల్‌లో నాన్ అఫీషియల్ మెజారిటీకి అవకాశం కల్పించారు.* శాసన కౌన్సిల్‌లో అనుబంధ ప్రశ్నలు అడిగేందుకు, తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు సభ్యులకు అవకాశం కల్పించారు.* వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్‌లో తొలిసారి భారతీయులకు అవకాశం కల్పించారు. (ఈ అవకాశం దక్కించుకున్న తొలి భారతీయుడు - సత్యేంద్ర ప్రసాద్ సిన్హా)* ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా 1947 లో భారతదేశం రెండు దేశాలుగా విడిపోవడానికి ఈ చట్టం బీజం వేసింది.1919 చట్టం
       
బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టే దిశగా బ్రిటిష్ పార్లమెంట్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్నే మాంటెగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం అని కూడా అంటారు. (మాంటెగ్ నాటి సెక్రెటరీ ఆఫ్ స్టేట్, లార్డ్ ఛెమ్స్‌ఫర్డ్ అప్పటి వైస్రాయ్)
ముఖ్యాంశాలు:* కేంద్ర శాసనసభలో తొలిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్‌గా, దిగువ సభను లెజిస్లేటివ్ కౌన్సిల్‌గా వ్యవహరించడం ప్రారంభించారు.
రాష్ట్రాల్లో శాసనసభ సభ్యుల సంఖ్యను పెంచారు.* రాష్ట్రాల్లో ద్వంద్వపాలన ప్రవేశపెట్టారు. అంటే కొన్ని అంశాలను రిజర్వ్‌డ్ అంశాలుగా (ఉదా: భూమి శిస్తు, శాంతిభద్రతలు, న్యాయం లాంటివి) పరిగణించి, గవర్నర్ నియమించే మంత్రులకు ఈ అంశాలపై అధికారాలు కల్పించారు. మరికొన్ని అంశాలను Transfered అంశాలుగా భావించి (ఉదా: స్థానిక పాలన, ఆరోగ్యం) వాటిపై భారతీయ మంత్రులకు అధికారాలు కల్పించారు. దీంతో సమన్వయం లోపం, జవాబుదారీతనం లేకపోవడం లాంటివాటికి అవకాశం ఏర్పడింది.* చట్టసభల్లో సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు.
సైమన్ కమిషన్ (1927): 1919 చట్టం అమలు, పనితీరుకు సంబంధించి 1929 లో ఒక కమిషన్‌ను నియమించాల్సి ఉంది. అయితే భారతీయుల్లో బ్రిటిష్ పాలనపట్ల నెలకొన్న ఆగ్రహం దృష్ట్యా రెండేళ్లు ముందుగానే, అంటే 1927 లో సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ని నియమించింది. అయితే ఈ కమిషన్‌లో భారతీయులకు స్థానం లేకపోవడంతో అది పర్యటించిన ప్రదేశాల్లో భారతీయులు సైమన్ గో బ్యాక్ నినాదాలు చేశారు. ఈ కమిషన్ 1930లో తన నివేదికను సమర్పించింది. ద్వంద్వ పాలనను అంతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యతాయుత పాలన అందించాలని, వివిధ సంస్థానాలను కలిపి బ్రిటిష్ ఇండియా ఒక సమాఖ్యగా ఏర్పడాలని సైమన్ కమిషన్ అభిప్రాయపడింది. ఈ కమిషన్ చేసిన కొన్ని సిఫారసులను 1935 చట్టంలో మనం చూడొచ్చు.
కమ్యూనల్ అవార్డు (1932)
        
1932 లో అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్ దీన్ని ప్రకటించాడు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్‌లు, ఆంగ్లో-ఇండియన్లతోపాటు హిందూ సమాజంలో నిమ్న వర్గాలకు కూడా ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు. దీనిపట్ల అసంతృప్తి చెందిన గాంధీజీ ఎరవాడ జైలులో నిరాహారదీక్ష చేపట్టారు. చివరకు గాంధీజీ, అంబేడ్కర్ మధ్య సయోధ్య కుదిరి, నిమ్నవర్గాలను సాధారణ హిందూ సమాజంలో భాగంగా పరిగణిస్తూ కొన్ని రిజర్వ్‌డ్ నియోజకవర్గాలను వారికి కేటాయించారు. దీన్నే పూనా ఒడంబడిక అంటారు.
1935 చట్టం 
       
ఈ చట్టాన్ని ఒక రకంగా భారత్ రాజ్యాంగ మాతృకగా అభివర్ణించవచ్చు.*బ్రిటిష్ ప్రావిన్సులు, రాజసంస్థానాలతో కూడిన అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేసేందుకు ఈ చట్టం వీలు కల్పించింది.* రాష్ట్ర ప్రభుత్వాల్లో ద్వంద్వ పాలన రద్దు చేసి, వాటికి స్వయంప్రతిపత్తి కల్పించారు.* కేంద్రస్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు (కొన్ని అంశాలు రిజర్వ్‌డ్‌గా, మరికొన్నింటిని ట్రాన్స్‌ఫర్డ్‌గా పరిగణించారు).* బెంగాల్, బొంబాయి, మద్రాస్, బీహార్, అస్సాం సంయుక్త రాష్ట్రాలకు ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేశారు.* నిమ్నవర్గాల వారికి, స్త్రీలకు, శ్రామికులకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు.
ఈ చట్టంతో మొత్తం జనాభాలో సుమారు 10% ప్రజలకు ఓటు హక్కు లభించినట్లయ్యింది.* విత్తపరమైన అంశాలను క్రమబద్ధీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు.* ఒక ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేసేందుకు ఈ చట్టం వీలు కల్పించింది.
ఆగస్టు ఆఫర్:
    
రెండో ప్రపంచ యుద్ధానంతరం భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి (Dominion Status) ఇస్తామని లార్డ్ లిన్‌లిత్‌గో ప్రతిపాదించాడు. దీన్నే ఆగస్టు ఆఫర్ అంటారు.
క్రిప్స్ మిషన్ (1942)
     
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయులను శాంతపరచేందుకు సర్ స్టాఫర్డ్ క్రిప్స్‌ను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది.
దీనికి సంబంధించిన ముఖ్య వివరాలు:
* రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు మొదటిసారిగా అంగీకరించింది.* యుద్ధ సమయంలో భారతీయుల సహకారాన్ని కోరారు.* క్రిప్స్ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.* గాంధీజీ డూ ఆర్ డై (విజయమో వీరస్వర్గమో) అనే నినాదం ఇచ్చారు. ఈ క్రిప్స్ ప్రతిపాదనలను దివాళా తీయబోయే బ్యాంకు తర్వాత తేదీని ప్రకటించి ఇచ్చిన చెక్కుగా గాంధీ అభివర్ణించారు.
వేవెల్ ప్రణాళిక
    
1945 లో అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ ఈ పథకాన్ని రూపొందించారు. దీని ప్రకారం దేశ సార్వభౌమత్వం, రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ లాంటి అంశాలు బ్రిటిష్‌వారి చేతుల్లో ఉంటాయని, మిగతా అంశాల్లో భారతీయులకు అధికారాలిస్తామని, దీనికి బదులుగా భారతదేశంలో అన్ని వర్గాలు ప్రాతినిధ్యం కలిగి ఉండేలా ఒక యుద్ధసలహా మండలిని ఏర్పాటు చేయాలని సూచించాడు.
క్యాబినెట్
మిషన్ ప్లాన్
(1946)
     
రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్‌లో జరిగిన ఎన్నికల్లో అట్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని (సర్ స్టాఫర్డ్ క్రిప్స్, లారెన్స్, అలెగ్జాండర్) నియమించారు.
ఇందులోని ముఖ్య ప్రతిపాదనలు:
*భారతీయులను పాలించడానికి అవసరమైన రాజ్యాంగాన్ని వారే రూపొందించుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం.* బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర శాసనసభలు రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకుంటాయి.* స్వదేశీ సంస్థానాలు రాజ్యాంగ పరిషత్‌కు తమ ప్రతినిధులను పంపుకునే అవకాశం కల్పించారు.* అధికార మార్పిడి జరిగేవరకు దేశంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలి.
ఈ క్యాబినెట్ మిషన్ పాకిస్థాన్ ఏర్పాటును తిరస్కరించింది.* భారతదేశం నుంచి 1948 జూన్ 30 లోపే తాము నిష్క్రమించబోతున్నట్లు బ్రిటిష్ ప్రధాని అట్లీ తెలిపారు. అప్పటినుంచి ప్రత్యేక పాకిస్థాన్ డిమాండ్ మరింత ఉద్ధృతమైంది. దీంతో కాంగ్రెస్ నాయకులు, ముస్లింలీగ్ నాయకత్వానికి సయోధ్య కుదిర్చి, అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ తన విభజన ప్రణాళికను అమలుపరిచారు. దీన్నే మౌంట్ బాటన్ ప్రణాళిక అంటారు. దీని ప్రకారం భారత్, పాకిస్థాన్ రెండు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి.
1947
చట్టం ముఖ్యాంశాలు: భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన అంతమైంది. 1947 ఆగస్టు 15 న భారతదేశం ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది.* భారతదేశాన్ని రెండు స్వతంత్ర దేశాలుగా విభజించారు (ఇండియా, పాకిస్థాన్).* వైస్రాయ్ పదవిని రద్దుచేసి, రెండు దేశాలకు గవర్నర్ జనరల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.* రెండు దేశాలకు వేర్వేరు రాజ్యాంగ సభలను ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు.* పై రెండు రాజ్యాంగ సభలు తమ దేశాలకు పార్లమెంట్‌గా వ్యవహరిస్తూ అవసరమైన చట్టాలు రూపొందించవచ్చు.* భారతదేశం లేదా పాకిస్థాన్‌లో విలీనమయ్యే విషయంలో సంస్థానాలకే స్వేచ్ఛ ఇచ్చారు.* గవర్నర్ జనరల్‌కు కేవలం నామమాత్ర అధికారాలు మాత్రమే ఇచ్చారు. గవర్నర్ జనరల్ మంత్రిమండలి సలహాపై వ్యవహరించాలి.
     
ఇలా 1947 ఆగస్టు 15 న మన దేశం ఒక సర్వ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. మన రాజ్యాంగ నిర్మాణ సభ ఎన్నో ఆటుపోట్ల మధ్య ఎంతో మేథోమథనంతో భారత రాజ్యాంగాన్ని తయారుచేసింది.
 

ISHA SEARCH ENGINE