పంచవర్ష ప్రణాళికలు

పంచవర్ష ప్రణాళికలు
           స్వాతంత్య్రానికి పూర్వమే (బ్రిటిష్‌వారి పాలనా కాలంలో) భారతదేశంలో ప్రణాళికల కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జవహర్‌లాల్ నెహ్రూ (జాతీయ ప్రణాళికా కమిటీ), సర్ అదిషర్ దళాల్ నాయకత్వంలో బొంబాయికి చెందిన పారిశ్రామికవేత్తలు (బాంబే ప్లాన్), శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ (గాంధీ ప్లాన్), ఎం.ఎన్.రాయ్ (ప్రజా ప్రణాళిక) లాంటి మేధావులు ప్రణాళికల కోసం కృషిచేశారు. కానీ ఇవేవీ అమలులోకి రాలేదు.స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం 1950 మార్చిలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. (ఇటీవల దీని స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటైంది.) ప్రణాళిక సంఘం ద్వారా ఇప్పటి వరకు 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 12వ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉంది. ఆరో ప్రణాళిక కాలం నుంచి దేశ ఆర్థికాభివృద్ధి గమనంలో అనేక కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వీటిని పరిశీలిద్దాం.
 ఆరో ప్రణాళిక
 (1980 ఏప్రిల్ 1 - 1985 మార్చి 31)

     1980లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు జనతా పార్టీ ప్రవేశపెట్టిన నిరంతర ప్రణాళిక (1978)ను నిలిపివేసి ఆరో పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఉపాధి కల్పన ద్వారా నిరుద్యోగ నిర్మూలన, పేదరికం, అసమానతలు తగ్గించడం, స్వావలంబన దిశగా క్రమంగా ప్రగతి సాధించడం, అవస్థాపన సౌకర్యాలు కల్పించడం ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు. ఈ ప్రణాళికను 'నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక'గా అభివర్ణిస్తారు.

పైన పేర్కొన్న లక్ష్యాల సాధన కోసం ఈ ప్రణాళికలో ప్రభుత్వ రంగానికి రూ.1,09,260 కోట్లు కేటాయించారు. ఇందులో శక్తికి అత్యధికంగా 28 శాతం నిధులు, వ్యవసాయం, నీటి పారుదల రంగాలకు 24 శాతం నిధులు కేటాయించారు.
సాధించిన ప్రగతి
:      6వ ప్రణాళిక కాలంలో సాలుసరి 5.2 శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే 5.7 శాతం వృద్ధిరేటును సాధించడం జరిగింది. ప్రొఫెసర్ రాజ్‌కృష్ణ పేర్కొన్న 'హిందూ వృద్ధిరేటు' (5 శాతం)ను అధిగమించి తొలిసారిగా వృద్ధి నమోదైంది. ఇదే కాలంలో తలసరి ఆదాయంలో 3.2 శాతం వృద్ధిరేటు, వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధిరేటు నమోదయ్యాయి. ఈ ప్రణాళికా కాలంలో అదనంగా 11 మిలియన్ హెక్టారులకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. ఆహారధాన్యాల ఉత్పత్తిలో 154 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సాధించగలిగాం.   
     నిరుద్యోగ, పేదరిక నిర్మూలన కోసం ఈ ప్రణాళికలో ప్రత్యేకంగా సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం (IRDP - 1980 దేశవ్యాప్తంగా), గ్రామీణ, భూమిలేని వారికి ఉపాధి భద్రతా పథకం (RLEGP - 1983), జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (NREP - 1980), గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, శిశువుల అభివృద్ధి పథకం (DWACRA) మొదలైన కార్యక్రమాలు చేపట్టారు.
     వృద్ధిరేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆరో ప్రణాళిక కాలంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఆదాయ అసమానతలు, తదితర సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి.

వార్షిక ప్రణాళికలు (1990-92):ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, విదేశీ మారక నిల్వల కొరత, ధరల పెరుగుదల, తదితర సమస్యల వల్ల 1990 - 92 మధ్యకాలంలో వార్షిక ప్రణాళికలను అమలు చేశారు. ఈ కాలంలో భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.
 ఎనిమిదో ప్రణాళిక
 (1992 ఏప్రిల్ 1 - 1997 మార్చి 31)


ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక 1990 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, కేంద్రంలో రాజకీయ అనిశ్చితి కారణంగా ప్రారంభం కాలేదు. 1992 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. 'మానవ వనరుల అభివృద్ధి'లో భాగంగా శతాబ్ది అంతానికి సంపూర్ణ ఉద్యోగిత సాధించడం, జనాభా పెరుగుదలను అరికట్టడం, సార్వత్రిక ప్రాథమిక
విద్య, తాగునీరు, అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాలతో ఎనిమిదో ప్రణాళిక ప్రారంభమైంది. ముఖ్యాంశాలు... ప్రణాళికను పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ నమూనా (ఎల్‌పీజీ) ఆధారంగా రూపొందించారు.నూతన ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత ప్రారంభించిన మొదటి ప్రణాళిక ఇది.ఈ ప్రణాళిక నుంచి భారత్ సూచనాత్మక ప్రణాళిక విధానాన్ని అమలు పరిచింది. దీనిలో ప్రభుత్వరంగ ప్రాధాన్యం తగ్గి ప్రైవేటు రంగానికి ప్రాముఖ్యం పెరిగింది.


ఈ ప్రణాళిక కాలంలో బడ్జెట్ లోటును, విదేశీ రుణాన్ని సవరించే లక్ష్యంతో భారత ఆర్థిక వ్యవస్థను క్రమంగా ఓపెన్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రయత్నం జరిగింది.ఈ ప్రణాళికలో మొత్తం ప్రణాళిక వ్యయంలో ప్రభుత్వ రంగానికి రూ.4,85,460 కోట్లు కేటాయించారు. అత్యధికంగా ఇంధన రంగానికి 27 శాతం నిధులు కేటాయించారు.
ప్రణాళిక ప్రగతి
: ఈ ప్రణాళికలో వృద్ధిరేటు లక్ష్యం 5.6 శాతం, సాధించింది 6.8 శాతం. ఈ ప్రణాళిక కాలంలో తలసరి ఆదాయ వృద్ధిరేటు 4.6 శాతం, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో 3.9 శాతం, పారిశ్రామిక రంగంలో 8 శాతం (నిర్దేశించింది 7.6 శాతం), సేవారంగంలో 7.9 శాతం (నిర్దేశించింది 6.1 శాతం) వృద్ధిరేటు నమోదయ్యాయి.ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన (PMRY - 1993), జాతీయ సామాజిక సహాయ పథకం (NSAP - 1995), గంగా కళ్యాణ్ యోజన (GKY) లాంటి పథకాలు ఈ ప్రణాళికలో ప్రారంభమయ్యాయి. ఈ ప్రణాళిక కాలంలో ధనిక, పేద అంతరాలు పెరిగాయనే అభిప్రాయం ఉంది.


 
 


ISHA SEARCH ENGINE