మధ్యయుగం - దక్షిణ భారత రాజ్యాలు - అప్పటి ఆర్థిక వ్యవస్థ

మధ్యయుగం - దక్షిణ భారత రాజ్యాలు - అప్పటి ఆర్థిక వ్యవస్థ
        క్రీ.శ. 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉన్న మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో కాకతీయులు, విజయనగర రాజులు, గోల్కొండ కుతుబ్‌షాహీలు ప్రధానంగా పరిపాలించారు. వీరి కాలంలో దక్షిణ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమ రంగాల్లో అనేక మార్పులు సంభవించాయి. ద్రవ్య వ్యవస్థలో అనేక నూతన నాణేలు చెలామణిలోకి వచ్చాయి. ఆయా రాజ్యాలను సందర్శించిన విదేశీ యాత్రికుల రచనలు, నాటి సమకాలీన రచనలు అప్పటి ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను మనకు తెలియజేస్తున్నాయి.

కాకతీయ యుగం:

      తెలుగు భాష మాట్లాడేవారందరిని ఏకం చేసి పాలించిన తొలి వంశం కాకతీయులు. కాకతీయ వంశ మూల పురుషుడు దుర్జయుడు కాగా రాజ్యస్థాపకుడు మొదటి బేతరాజు. స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు కాకతి రుద్రుడు/ రుద్రదేవుడు/ మొదటి ప్రతాపరుద్రుడు. కాకతీయుల్లో గొప్పవాడు గణపతి దేవుడు. చివరి కాకతీయ చక్రవర్తి రెండో ప్రతాపరుద్రుడు.
     
కాకతీయుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. కాకతీయులు వ్యవసాయాభివృద్ధికి విరివిగా చెరువులను తవ్వించారు. కేసరి తటాకాన్ని మొదటి ప్రోలరాజు, పాకాల చెరువును జగదళముమ్మడి, రామప్ప చెరువును రేచర్ల రుద్రుడు తవ్వించారు. 'బయ్యారం', 'లక్కవరం', ఘనపురం చెరువులు కూడా కాకతీయ పాలకులు తవ్వించినవే. చెరువులపై అధిపతిని దశబంధఅని, చెరువు నీటిని వాడుకున్నందుకు చెల్లించే పన్నులను దశబంధమాన్యంఅని పేర్కొనేవారు.

         గ్రామాల్లో ఆయగాండ్రు మేర అనే పేరుతో శిస్తు వసూలు చేసేవారు. కౌలు రైతులను అర్ధశీలి, వారు చెల్లించే కౌలును కోరు అని పిలిచేవారు. భూములను కొలవడానికి పెనుంబాకం మానదండం, కేసరిపాటిగడలాంటి పరికరాలను వినియోగించేవారు. సర్వే చేసిన భూములను రాచపొలం, నీరుపొలం, తోట పొలం, వెలిపొలం అనే రకాలుగా వర్గీకరించేవారు. పంటలు బాగా పండే భూములను అచ్చుకట్ల భూమి అనేవారు. కాకతీయ కాలం నాటి సన్నిగండ్ల శాసనం కొలగాండ్రు, కరణాలు అనే ఉద్యోగుల పేర్లను ప్రస్తావించింది. కోట గణపాంబ వేయించిన మొగలుట్ల శాసనం అనేక రకాల వృత్తిపన్నుల గురించి వివరిస్తుంది.
          
కాకతీయ యుగంలో భూమిశిస్తుతోపాటు అనేక రకాల పన్నులు వసూలు చేసేవారని తెలుస్తోంది. గొర్రెల మందలపై, యాదవ వర్గాలపై అడ్డవట్ల సుంకం/ అడ్డుసుంకం వసూలు చేసేవారు. రాజును దర్శించుకోవడానికి చెల్లించే పన్ను - దర్శనం. రాజు అకారణంగా విధించే పన్ను - అప్పనం. యువరాజు భృతికోసం చెల్లించే పన్ను - ఉపకృతి. దీన్నే చాళుక్యయుగంలో దొగరాజు పన్నుఅనేవారు. పన్ను కట్టాల్సిన రైతులను అరిగాపులు, పన్ను వసూలు అధికారులను కొలగాండ్రు అని పిలిచేవారు. ధనరూపంలో విధించే పన్నును పట్టపు హుండిగా
ధాన్యరూపంలో విధించే పన్నును పట్టుకొలచుగాపేర్కొనేవారు. అప్పట్లో ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండించేవారని చరిత్రకారులు పేర్కొన్నారు. రాజన్నశాలి అనేది అప్పట్లో ఒక వరి వంగడం. వ్యవసాయంతోపాటు వర్తక వాణిజ్యాలు, పరిశ్రమలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. అప్పటి మచిలీపట్నం వస్త్రాల గురించి మార్కోపోలో పేర్కొన్నాడు. రుద్రమదేవి కాలంలో వచ్చిన ఇటలీ దేశానికి చెందిన వెనిస్ నగర వర్తకుడు/యాత్రికుడు తాను రాసిన (నా యాత్రలు/ మై పిలిగ్రిమ్స్/ మైట్రావెల్స్) గ్రంథంలో ఎన్నో విషయాలు పేర్కొన్నాడు.

          అప్పట్లో ప్రధాన ఓడరేవు మోటుపల్లి, అక్కడ జరిగే విదేశీ వాణిజ్యం, ముఖ్యంగా అప్పటి వజ్ర పరిశ్రమ అభివృద్ధి గురించి వివరించాడు. పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్ర గ్రంథంలో 20కి పైగా వస్త్రాల రకాల గురించి రాశాడు. ఓరుగల్లులో రత్నకంబళ్లు, ముఖమల్ వస్త్రాలు నేసేవారు. నిర్మల్, కూన సముద్రం ప్రాంతాల్లో తయారయ్యే కత్తులు సిరియా రాజధాని డెమాస్కస్‌కు ఎగుమతి అయ్యేవి. మోటుపల్లి (ప్రకాశం జిల్లా), కృష్ణపట్నం (నెల్లూరు జిల్లా), హంసలదీవి (గుంటూరు జిల్లా), మైసోలియా/ మచిలీపట్నం (కృష్ణాజిల్లా) లాంటి రేవు పట్టణాలు విదేశీ, స్వదేశీ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించాయి. గణపతిదేవుడు మోటుపల్లి రేవులో అభయ శాసనం వేయించాడు. విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించాలనిరుద్రదేవుడి నీతిసారం గ్రంథం వివరిస్తుంది. కాకతీయుల కాలం నాటి ప్రధాన పరిశ్రమ వజ్ర పరిశ్రమ అని మార్కోపోలో పేర్కొన్నాడు. నాటి వర్తకులునకరం, స్వదేశీ, నానాదేశి, పరిదేశి లాంటి శ్రేణులుగా రూపొందారు. వర్తక సంఘాన్ని నకరం అనేవారు. త్రిపురాంతకంలో అయ్యావలి అయి నూరరు(500) అనే కన్నడ వర్తక సంఘం కూడా వర్తక, వాణిజ్యాలు నిర్వహించేది.యనమదల శాసనం నాటి వర్తక శ్రేణుల గురించి వివరిస్తుంది. రెండో ప్రతాపరుద్రుడు కర్నూలు (కందనోవాలు) ప్రాంతంలోని అడవులను నరికించి వ్యవసాయ భూములుగా మార్చాడు. నాటి ప్రధాన బంగారు నాణెంగద్యాణం. దీన్నే నిష్క/ మాడ అని కూడా పిలిచేవారు. రూక అనేది నాటి ప్రధాన వెండి నాణెం. ఒక మాడకు పది రూకలు అని బాపట్ల దేవాలయ శాసనం పేర్కొంటుంది. రూకలో విభాగాలైన అడ్డుగ, పాతిక, వీస, చిన్నం అనే నాణేలు కూడా వాడుకలో ఉండేవి. ఇటీవల తవ్వకాల్లో బయల్పడిన కాకతీయ యుగం నాటి ద్రెక్మ నాణెం గ్రీకు నాణేలను పోలి ఉంది. ఈ యుగంలో చైనా నుంచి సిల్కు దిగుమతి చేసుకునేవారని మార్కోపోలో పేర్కొన్నాడు.

       కాకతీయ అనంతర యుగంలో ముసునూరు నాయకులు, రేచర్ల వెలమలు, రెడ్డిరాజులు తెలుగు ప్రాంతాలను పాలించారు. వారి కాలంలో కూడా వ్యవసాయ, వాణిజ్య రంగాలు కొంత అభివృద్ధి చెందాయి. విలస తామ్రశాసనం ప్రకారం నాడు 1/6వ వంతు భూమి శిస్తు వసూలు చేసేవారు. దేవ బ్రాహ్మణ మాన్యాలపై పన్ను మినహాయింపు ఉండేది. దశబంధ మాన్యం పేరుతో 1/10వ వంతు నీటి తీరువా పన్ను వసూలు చేసేవారు. నాటి ప్రధాన ఆహార పంట జొన్న కాగా, ప్రధాన వాణిజ్య పంట ద్రాక్ష. రెడ్డిరాజులు సంతానసాగరం చెరువును తవ్వించారు. పెదకోమటి వేమారెడ్డి భార్య సూరాంబిక సంతాన సాగరం చెరువును గుంటూరు జిల్లాలో (ఫిరంగిపురం వద్ద) తవ్వించింది. సూరాంబిక కుమారుడు రాచవేమారెడ్డి ఆ చెరువుకు జగనొబ్బగండ అనే కాలువను తవ్వించినట్లు అమీనాబాద్ శాసనం తెలియజేస్తుంది. రేచర్ల వెలమ పాలకుడు మాదనీడు భార్య నాగాంబిక కూడా నాగసముద్రం అనే చెరువును తవ్వించి వ్యవసాయభివృద్ధికి పాటుపడింది. అనపోతుసముద్రం, రాయసముద్రం చెరువులను కూడా రేచర్ల వెలమ పాలకులు తవ్వించారు.
ఆ కాలంలో వస్త్ర పరిశ్రమ అగ్రస్థానంలో ఉండేది. పలనాడు, వినుకొండ అప్పటి ప్రధాన వస్త్ర పరిశ్రమ కేంద్రాలు.కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రంశిక గ్రంథంలో అనేక రకాల పట్టు, నేత వస్త్రాలను శ్రీలంకకు ఎగుమతి చేసినట్లుగా వర్ణన ఉంది. నిర్మల్ కత్తులు ఎంతో ప్రసిద్ధి చెందాయి. కొండవీడుకు చెందిన అవచి తిప్పయ్యశెట్టి అప్పటి విదేశీ వాణిజ్యంలో అత్యంత ప్రముఖుడు. శ్రీనాథుడు తన గ్రంథం హరవిలాసంలో కప్పలి,జోంగు,వలి,వల్లికా అనేక నౌకల రకాల గురించి పేర్కొన్నాడు. జోంగు అనేది చైనాకు చెందిన వాణిజ్య నౌక.

విజయనగర యుగం

         క్రీ.శ. 1336లో హరిహర బుక్కరాయలు అనెగొంది కేంద్రంగా తుంగభద్రా నదీ తీరంలో విజయనగరసామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ సామ్రాజ్యాన్ని సంగామ, సాళువ, తుళువ,అరవీడు వంశాలు పరిపాలించాయి. క్రీ.శ. 1347లో హసన్ గంగూ బహమన్ షా గుల్బర్గా కేంద్రంగా బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రెండు రాజ్యాల మధ్య రాయచూర్ దోవాబ్ ప్రాంతం కోసం నిరంతరం యుద్ధాలు జరిగాయి. రెండు రాజ్యాలు వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల రంగాలను సమంగా అభివృద్ధి చేసి దక్షిణ భారతదేశ ఆర్థికాభివృద్ధికి కృషి చేశాయి. ఈ సామ్రాజ్యాలను సందర్శించిన ఇబన్ బటూటా, నికోలోకాంటె, అబ్ధుల్ రజాక్, డొమింగో పెయిజ్, న్యూనిజ్, బార్బోసా, వర్థెమా, అథనేషియన్ నికెటిన్ లాంటి విదేశీ యాత్రికులు అప్పటి పరిస్థితులను తమ రచనల్లో వివరించారు.

         విజయనగర పాలకులు వ్యవసాయాభివృద్ధికి విరివిగా చెరువులను తవ్వించారు. దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. విజయనగర పాలకులు ఆర్థిక పాలనలో సమర్థమైన విధానాలను అమలు చేశారు. అప్పటి రెవెన్యూ శాఖను అట్టావన, సైనిక శాఖను కండాచార శాఖ అని పిలిచేవారు. రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. తీరాంధ్ర ప్రాంతంలో కేసరి పాటిగడ సహాయంతో భూమిని తిమ్మరుసు స్వయంగా సర్వే చేయించాడు. రేనాడు ప్రాంతంలో సర్వే నిర్వహణకు దోరగడను వినియోగించారు. కవిలె సంప్రతులుఅనే ఉద్యోగులు గ్రామాల్లోని భూముల వివరాలను కవిలెలు అనే పుస్తకాల్లో నమోదు చేసేవారు.

      మగాణీ భూములను నీరాంబర, మెట్ట భూములను కాడాంబర అని పిలిచేవారు. బ్రాహ్మణ ఈనాములపై 1/6వ వంతు, దేవాలయ భూములపై 1/30వ వంతు పన్ను వసూలు చేసేవారు. భూమిశిస్తు 1/3వ వంతు వసూలు చేసేవారు. అనేక రకాల ఇతర పన్నులు వసూలు చేసేవారు. శ్రీకృష్ణదేవరాయులు కొండవీడు శాసనంలో 59 రకాల పన్నులను వివరించారు. స్వర్ణకారులు చెల్లించే పన్నును సిద్దాయం, వివిధ వృత్తులవారు చెల్లించే పన్నును జాతి సిద్ధాయం, చేనేత కార్మికులు చెల్లించే పన్నును వింజ సిద్ధాయం అని పేర్కొనేవారు. పశువులను పచ్చిక బయళ్లలో మేపడం కోసం పుల్లరి పన్నును చెల్లించేవారు. చివరికి బిచ్చగాళ్లు కూడా గణాచారి పన్ను చెల్లించేవారు. కుమ్మరివారు చక్రకానికె కూడా పన్ను చెల్లించేవారు. ఉప్పు కొటార్లపై ఉప్పరి పన్నును, గృహాలపై ఇల్లరి పన్నును విధించేవారు. సాలెవారు (కైకోలులు) మగ్గరి, పింజసిద్ధాయం లాంటి పన్నులు చెల్లించేవారు. వివాహ సమయంలో కల్యాణ కానికె, గుడి కల్యాణం లాంటి పన్నులు చెల్లించాలి. నాగులాపురంలోకి ప్రవేశించే వస్తువులపై సాలీనా 42 వేల పగోడాల ఆదాయం వచ్చేదని న్యూనిజ్ రాశాడు. వైవాహిక సుంకాన్ని రద్దుచేసిన తొలి విజయనగర పాలకుడిగా సాళువ వీరనరసింహుడిని పేర్కొంటారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా కందనవోలు, చంద్రగిరి ప్రాంతాల్లో వివాహ సుంకాలను రద్దు చేశాడు. కొండోజు అనే మంగలి కోరడంతో అళియ రామరాయలు మంగలి పన్నును రద్దు చేశాడు. విజయనగర యుగంలో ఆర్థిక సంవత్సరం మహార్నవమితో ప్రారంభమయ్యేదని డొమింగో పెయిజ్ పేర్కొన్నాడు




విజయనగర యుగం నాటి తటాకాల గురించి పోరుమామిళ్ల శాసనం (కడప జిల్లా) తెలియజేస్తుంది. మొదటి బుక్కరాయల కాలంలో పెనుగొండ వద్ద శిరువేరు తటాకం, సాళువ నరసింహుడి కాలంలో అనంతపురం వద్ద నరసాంభుది తటాకం, శ్రీకృష్ణదేవరాయల కాలంలో నాగులాపురం చెరువులను తవ్వించారు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు ఇంజినీర్ల సహాయంతో తుంగభద్రా నదిపై తూరుట్టు ఆనకట్టను నిర్మించాడు. కావేరి నదిపై కృష్ణరాయ సాగర్ ఆనకట్ట, కోరుగల్లు ఆనకట్టలు శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే నిర్మించారు. దేశమంతటా తోటలు విస్తారంగా ఉన్నాయని, పండ్లు చౌకగా లభించేవని డొమింగో పెయిజ్ పేర్కొన్నాడు. విజయనగర యుగంలో భూమి అంతా రాజుకు చెందిందే అని, రైతులకు భూమిపై యాజమాన్య హక్కులు లేవని న్యూనిజ్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఆధునిక చరిత్రకారులైన వెంకట రమణయ్య, ఈశ్వరదత్ కూడా ధ్రువీకరించారు. అప్పటి వ్యవసాయ రంగంలో ఉపకార కౌలుదారీ పద్ధతి, సేవ కౌలుదారీ పద్ధతి అనే రెండు రకాల కౌలు విధానాలు అమల్లో ఉండేవి. రాజ్యానికి సేవలందించిన వ్యక్తులకు ప్రతిఫలంగా భూములను ఇచ్చేవారు. వాటిని కర్ణాటక ప్రాంతంలో ఉంబళి భూములు, మహారాష్ట్ర ప్రాంతంలో ఈనాడు భూములని పిలిచేవారు. ఉపకార కౌలు భూముల్లో బ్రహ్మదేయ, దేవదేయ/ దేవమేయ, మఠపుర అనే రకాల భూములుండేవి. సేవ కౌలుదారీ ప్రాంతాల్లోని భూములను అమర నిగమలు అని పేర్కొనేవారు. శిస్తును ధన రూపంలో చెల్లించే పద్ధతిని కందయ అనేవారు. కౌలురైతు యజమాని కోసం భూమిని సాగు చేసినందుకు ప్రతిఫలంగా పంటలో కొంత భాగం అతడికిచ్చే విధానాన్ని వరుం కౌలుదారీ విధానం అంటారు. దీన్నే కర్ణాటక ప్రాంతంలో కోర్ కౌలుదారీ పద్ధతి అనేవారు. బంజరు భూములను సాగులోకి తెచ్చే ప్రాంతాల్లో శ్రమ కౌలుదారీ పద్ధతి ఉండేది. మాగాణి భూములను నీరాంబర అనేవారు. వీటిని తిరిగి వరి ధాన్యం పండే భూములు, తోట భూములుగా వర్గీకరించారు.


మెట్ట భూములను కాడాంబర అనేవారు. వీటిని భూసారం, పంట దిగుబడి ప్రాతిపదికన 6 రకాలుగా వర్గీకరించారు. అవి:
     1. యేరి (నల్లరేగడి భూములు)
     2. కరిమన్సబ్ (బంకమట్టి భూములు)
     3. కెమ్మన్ (ఎర్రనేలలు)
     4. మలల్(ఇసుక నేలలు)
     5. ఇమ్మన్ (మిశ్రమ నేలలు ఉన్న భూమి)
     6. గోనికల్ (రాతి భూమి/ రాళ్లున్న భూమి)
   అప్పటి భూమి శిస్తు వసూలు విధానాల గురించి కూడా అనేక ఆధారాలు పేర్కొంటున్నాయి.
        కాలువలు, చెరువుల ద్వారా నీటి సదుపాయం పొందే భూముల మీద 1/3వ వంతు శిస్తును, వర్షాధార భూముల మీద 1/4వ వంతు శిస్తును, నదుల నీటి సదుపాయం ఉన్న భూముల మీద 1/2వ వంతు శిస్తును విధించినట్లు శుక్రనీతి పేర్కొంటుంది. 1/6వ వంతు శిస్తును రాజు పన్నుగా వసూలు చేసేవాడని పరాశర మాధవీయం గ్రంథం పేర్కొంటుంది. ఈనాం భూములపై విధించే నామమాత్రపు పన్నును శ్రోతియం అనేవారు. బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన భూములపై కూడా 1/4వ వంతు పన్ను వసూలు చేసేవారు. దాన్ని పంగ లేదా పంగం అనేవారు. మాన్య గ్రామాల్లోని భూములపై పుట్టి తూములు అనే పన్ను విధించేవారు. తమలపాకులను పండించే రైతులపై విధించే పన్నును ఆకుల మంత్రాయం అని పిలిచేవారు.


  భూమిశిస్తు విధానంలో స్థూల పద్ధతి, భూమి నాట్ల సామర్థ్య పద్ధతి, నాగలి పద్ధతి, విస్తీర్ణం పద్ధతి అనే విధానాలు అమల్లో ఉండేవని చరిత్రకారులు పేర్కొంటున్నారు. పండిన పంటలో కొంత భాగాన్ని శిస్తుగా నిర్ణయించడమే స్థూల పద్ధతి. భూమిలో నాటడానికి ఉపయోగించిన విత్తనాల మొత్తం ఆధారంగా శిస్తు నిర్ణయించడమే నాట్ల సామర్థ్య పద్ధతి. భూమిని దున్నడానికి అవసరమైన నాగళ్ల సంఖ్య ఆధారంగా శిస్తు విధించడాన్ని నాగలి పద్ధతి, భూమిని సర్వేచేసి, కొలిచి విస్తీర్ణం ఆధారంగా శిస్తు విధించడాన్ని విస్తీర్ణం పద్ధతి అని పిలిచేవారు. శిస్తు వసూలు విధానంలో కూడా రైత్వారీ, గుత్తదారీ, గ్రామవారీ పద్ధతులు అమల్లో ఉండేవి. దక్షిణ భారతదేశంలో మాలిక్ అంబర్ తొలిసారిగా రైత్వారీ విధానాన్ని అమలు చేశాడు. మైసూర్ ప్రాంతంలో గ్రామ గుట్టిగె, వంటి గుట్టిగె, ప్రజా గుట్టిగె, కుల్గార్ గుట్టిగె, చేగార్ కట్లె, బ్లా కట్లె లాంటి శిస్తు వసూలు పద్ధతులు అవలంభించేవారు. గ్రామాధికారి శిస్తు వసూలు చేసే పద్ధతిని గ్రామ గుట్టిగె అని, ప్రభుత్వం తరపున ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు శిస్తు వసూలు చేసే పద్ధతిని వంటి గుట్టిగె అని, ప్రజలందరూ ప్రభుత్వానికి నేరుగా శిస్తు చెల్లించే పద్ధతిని ప్రజా గుట్టిగె అనేవారు. ప్రభుత్వం ఒక నాయకుడితో ఒప్పందం చేసుకుని, అతడి నుంచి వసూలు చేసుకునే పద్ధతిని కుల్గార్ గుట్టిగె అనేవారు. ఒక రైతు ఇతర రైతులందరి నుంచి శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తే దాన్ని చేగార్ పద్ధతి అనేవారు. రెవెన్యూ శాఖను అట్టావన్/ అఠవనె అని పిలిచేవారు. రెవెన్యూ శాఖ అధిపతిని అఠవనేయ పారుపత్యదారు అనేవారు. గ్రామాల్లో గౌడులు అనే అధికారులు, సెనబావలు/ షనభోగులు అనే ఉద్యోగులు రెవెన్యూ పాలనలో సహాయపడేవారు.
           విజయనగర కాలంనాటి వర్తక, వాణిజ్యాలు, పరిశ్రమల అభివృద్ధి గురించి అనేక మంది విదేశీ రాయబారులు, యాత్రికులు తమ రచనల్లో వర్ణించారు. నూలువస్త్ర, వజ్ర, లోహ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. తాటిపత్రి, ఆధోని, గుత్తి, వినుకొండ లాంటి ప్రాంతాలు నూలు వస్త్రాలకు ప్రసిద్ధి చెందాయి. మచిలీపట్నం కలంకారీ, అద్దకం పరిశ్రమకు ప్రధానకేంద్రంగా వెలుగొందింది. కర్నూలు, గుత్తి, అనంతపురం ప్రాంతాల్లో వజ్రాలు అధికంగా దొరికేవి. వజ్రకరూర్ గనులు వజ్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందాయి. అప్పట్లో దేశంలో నకిలీ వజ్రాలు కూడా తయారయ్యేవని బార్బోసా పేర్కొన్నాడు. గ్రామాల్లో జరిగే స్థానిక సంతల గురించి ఆముక్త మాల్యద గ్రంథంలో శ్రీకృష్ణదేవరాయలు వివరించాడు. సాయంత్రం సంతల్లో అమ్మే కూరగాయలు, పండ్లు, గుర్రాలు, కలప లాంటి వస్తువుల గురించి డొమింగో పెయిజ్ పేర్కొన్నాడు. అప్పటి వ్యాపార కేంద్రాల గురించి హంశవింశతి గ్రంథం వివరిస్తుంది. విజయనగర సామ్రాజ్యంలో 300 ఓడరేవులున్నాయని రెండో దేవరాయల కాలంలో వచ్చిన పారశీక రాయబారి అబ్ధుల్ రజాక్ పేర్కొన్నాడు. మోటుపల్లి రేవు కోసం కొండవీడు, విజయనగర రాజ్యాల మధ్య సుదీర్ఘకాలం ఘర్షణలు జరిగాయి. మొదటి దేవరాయలు మోటుపల్లి రేవులో అభయశాసనం వేయించాడు. పులికాట్ రేవులో వ్యాపారంచేసే హిందూ, ముస్లిం వ్యాపారుల గురించి, అక్కడ జరిగే ఎగుమతి, దిగుమతుల గురించి బార్బోసా వివరించాడు. నాడు కాలికట్ రేవు ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రంగా ఉండేది. టోకు వర్తకులు హెర్నుకం అనే పన్ను చెల్లించేవారు. నాటి వర్తక, వాణిజ్య కేంద్రాలను నకరములు అనేవారు. నాటి గ్రామీణ జీవన విధానం గురించి బార్బోసా తన రచనల్లో వివరించాడు.

పశు పోషకులను కంబలత్తార్/కురుబలు/ఇదయనులు అనేవారు. సాలేవారిని కైకోలు అనేవారు. వ్యవసాయదారులను వక్కలి / వెల్లాలు అని పిలిచేవారు. గారడీ విద్యలు ప్రదర్శించేవారిని విప్రవినోదులు అనేవారు. విజయనగర కాలంనాటి ప్రధాన బంగారు నాణెం గద్యాణం. దాన్ని వాడుకభాషలో వరహా అనేవారు. కాని ఎక్కువగా చెలామణిలో ఉన్న బంగారు నాణెం మాత్రం ఫణం. తార్ అనేది నాటి ప్రధాన వెండి నాణెం. జిటాల్, కాసు అనేవి రాగి నాణేలు. అప్పట్లో దీనారం అనే పర్షియన్ నాణెం కూడా వాడుకలో ఉండేది. తార్ అనేది ఫణంలో ఆరోవంతు. శ్రీకృష్ణదేవరాయలు రాముడి ప్రతిమతో కూడా నాణేలు ముద్రించాడు. రెండో వెంకటపతి రాయల కాలం నుంచి నాణేలపై నమో వేంకటేశాయ నమః అనే లేఖనాలు దర్శనమిస్తున్నాయి.
కుతుబ్‌షాహీ యుగం
          బహమనీ సామ్రాజ్య శిథిలాల నుంచి ఆవిర్భవించిన 5 రాజ్యాల్లో గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యం ఒకటి. కుతుబ్‌షాహీ రాజ్యాన్ని గోల్కొండ రాజధానిగా సుల్తాన్ కులీకుతుబ్ షా ప్రారంభించారు. వీరిలో ఇబ్రహీం కులీ కుతుబ్‌షా, మహ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా లాంటి పాలకులున్నారు. చివరి కుతుబ్ షాహీ పాలకుడు హబుల్ హసన్. తానీషాను 1686లో ఔరంగజేబు ఓడించి గోల్కొండ రాజ్యాన్ని మొఘలు సామ్రాజ్యంలో విలీనం చేశాడు. కుతుబ్‌షాహీ పాలకులు గోల్కొండ రాజ్య అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల రంగాలను అభివృద్ధి చేశారు. ఈ రాజ్యాన్ని సందర్శించిన థేవ్‌నట్, మెథోల్డ్, ట్రావెర్నియర్ లాంటి విదేశీయుల రచనల ద్వారా అప్పటి ఆర్థిక అభివృద్ధిని, సామ్రాజ్య వైభవాన్ని అంచనా వేయవచ్చు.
గోల్కొండ కుతుబ్ షాహీ పాలకులు సమర్థమైన పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. చక్రవర్తికి పరిపాలనలో సహాయపడటానికి మజ్లిస్ దివాన్‌దరి అనే మంత్రిమండలి పనిచేసేది. నాటి ఆర్థిక మంత్రిని మీర్‌జుమ్లా అనేవారు. ఓడరేవులపై అధిపతిని షాబందర్ అనేవారు. రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు. ఆరోజుల్లో ప్రభుత్వ ఆదాయం సాలీనా 5 కోట్ల హొన్నులని, అందులో 19 లక్షల హొన్నుల నికర ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరేదని మెథోల్డ్ అనే చరిత్రకారుడు తెలియజేశాడు. నాడు జమీందారీ, హవేలీ అని రెండు రకాల భూములు ఉండేవి. పన్నులేని భూములను సావరం భూములు, ప్రభుత్వ భూములను హవేలీ భూములు అనేవారు. శిస్తు విధింపు కోసం వీసబడి పద్ధతి, పాలుపద్ధతి అనే రెండు విధానాలు అనుసరించేవారు. నేల స్వభావాన్ని బట్టి భూములను విభజించి సాధనా సంపత్తి, పశుబలాన్ని బట్టి శిస్తు విధించడాన్ని వీసబడి పద్దతి అంటారు. పొలంలో అన్ని ఖర్చులను రైతే భరిస్తే పంటలో 1/2వ వంతు; ప్రభుత్వమే అన్ని ఖర్చులూ భరిస్తే రైతుకు పంటలో 1/4వ వంతు ఇచ్చే విధానాన్ని పాలు పద్దతి అంటారు. అలాగే నాటి గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను 'కడెం', 'పాయ్‌కారి' రైతులు అని రెండు రకాలుగా పేర్కొనేవారు. భూములపై వంశపారంపర్య హక్కులున్న రైతులను కడెం రైతులని, కడెం రైతుల వద్ద భూములను కౌలుకు తీసుకున్న రైతులను పాయ్‌కారి/ పాయ్‌బకి రైతులని పిలిచేవారు. మెథోల్డ్ ప్రకారం హిందువులు వరిని ఎక్కువగా పండించేవారని, మచిలీపట్నంలో మూడు పంటలు పండించేవారని తెలుస్తోంది. థేవ్‌నట్ ప్రకారం అప్పట్లో పండ్లతోటలు పుష్కలంగా పండేవి. ఉప్పు, తమలపాకులు, పొగాకు లాంటి వస్తువులపై ప్రభుత్వానికే గుత్తాధికారం ఉన్నట్లు; ద్రాక్షపండ్ల రసం నుంచి వైన్ తయారు చేసేవారని థేవ్‌నట్ పేర్కొన్నాడు. విదేశీ, స్వదేశీ వాణిజ్యాల్లో కోమట్లు అధిక పాత్ర పోషించేవారు. 
రేవుపట్టణాల్లో శిస్తు వసూలు అధికారాన్ని వేలం వేసేవారని, అలా వేలం పాట ద్వారా అధికారం పొందినవారిని ముస్తజీర్లు అని పిలిచేవారు. కుతుబ్ షాహీ యుగంలో ఇంగ్లండ్ నుంచి సీసం, అరేబియా నుంచి గుర్రాలు, పర్షియా నుంచి ఎండుపండ్లు, కశ్మీర్ నుంచి కుంకుమపువ్వు, పర్షియన్ గల్ఫ్ నుంచి ముత్యాలు ప్రధానంగా దిగుమతి చేసుకునేవారు. మజ్లిన్, కోలికో వస్త్రాలు, రత్నాలు, కెంపులు, ఆహార పదార్థాల లాంటివి ఎగుమతి చేసేవారు.
         అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో కోహినూర్ వజ్రం కొల్లూరు గనుల్లో దొరికిందని ట్రావెర్నియర్ పేర్కొన్నాడు. కొల్లూరు గనుల్లో 30 వేల మంది కార్మికులు పనిచేసేవారని మెథోల్డ్ పేర్కొన్నాడు. నిర్మల్, ఇందూర్, ఇందల్‌వాయ్ ప్రాంతాలు ఆయుధ పరిశ్రమకు పేరుగాంచాయి.
 

 

ISHA SEARCH ENGINE